నకిలీ నోట్ల కలవరంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సైతం నివేదిక పంపించాలని సత్తుపల్లి బ్యాంక్ అధికారులను ఆదేశించింది. దీంతో ఉలిక్కిపడిన బ్యాంక్ అధికారులు ఇటీవల పట్టుబడిన డంప్‌లోని రూ.2వేల నోట్లపై పోలీసులతో సంప్రదింపులు, విచారణ చేపట్టి నకిలీ నోటు కాదని..చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుమీద రూ.2వేల నోటును పోలినవి పట్టుబడ్డాయని తేల్చారు. నకిలీ నోట్లు కాదంటూ ఆర్‌బీఐకు నివేదిక పంపించినట్లు సమాచారం.
ఒక్కసారిగా కోట్లాది రూపాయల రూ.2వేల నోట్లు పట్టుబడ్డాయని ప్రచారంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. దీనికి తోడు రద్దయిన రూ.1000, రూ.500నోట్లు లభించడం కూడా బ్యాంక్ అధికారులకు పని కలిపించినట్లయింది. రద్దయిన పాత నోట్ల వివరాలను సైతం బ్యాంక్ అధికారులకు పంపించినట్టు సమాచారం. దేశంలోనే తొలిసారిగా వేంసూరు మండలం మర్లపాడులో దొరికిన రద్దయిన పాతనోట్లు రూ.12,11,500లకు సంబంధించి స్పెసిఫైడ్ బ్యాంక్‌నోట్స్ యాక్టు(ఎస్‌బీఎన్) కింద కేసు నమోదు కావడం గమనార్హం. రద్దయిన పాతనోట్లు ఎవరి వద్దయినా ఉంచుకోవాలంటే కేవలం మచ్చుకు పది మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల రద్దు సమయంలో స్పష్టంగా ప్రకటించింది.