హ్యాపీ బర్త్‌డే స్వీట్‌ ఫియాన్సీ: హీరోయిన్‌

'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' భామ ఫ్రిదా పింటో త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితుడు, అడ్వెంచర్‌ ఫొటోగ్రాఫర్‌ కోరీ ట్రాన్‌ను వివాహం చేసుకోనున్నారు. కోరీ పుట్టినరోజు సందర్భంగా తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఫ్రిదా ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకున్నారు. ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసిన ఫ్రిదా... ' నా జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను సృష్టించింది నువ్వే. ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. కాదు కాదు నేనే నా ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండేలా చేశాను. హ్యాపీ బర్త్‌డే స్వీట్‌ ఫియాన్సీ' అని క్యాప్షన్‌ జతచేశారు.



ఈ క్రమంలో ఫ్రిదా-కోరీలకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ నటీమణులు లీసా రే, నర్గిస్‌ ఫక్రీ, అనైతా ఫ్రాఫ్‌ హార్ట్‌ ఎమోజీలతో ఫ్రిదాకు అభినందనలు తెలిపారు. కాగా డానీ బోయెల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన స్లమ్‌డాగ్‌ సినిమాతో ఫ్రిదా తన కెరీర్‌ను ఆరంభించారు. ఈ మూవీలో తనకు జోడీగా నటించిన దేవ్ పటేల్‌తో కొన్నాళ్లపాటు ఆమె డేటింగ్‌ చేశారు. ప్రస్తుతం కోరీతో ప్రేమలో ఉన్న ఆమె త్వరలోనే వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫ్రిదా.. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మహిళా సాధికారికత, పిల్లల సంరక్షణ తదితర సామాజిక అంశాల్లో భాగస్వామ్యవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.